హైదరాబాద్లో విషాదం: గడువు ముగిసిన మందులు ఇచ్చారన్న ఆరోపణలు — 6 నెలల శిశువు మృతి
హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ జాగీరు — సన్ సిటీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వైద్యులు గడువు ముగిసిన మందులు ఇవ్వడం వల్లే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బండ్లగూడ జాగీరు ప్రాంతానికి చెందిన రాము అనే 6 నెలల బాబుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి మందులు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇచ్చిన మందులు గడువు ముగిసినవేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మందులు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే బాలుడి మరణానికి కారణమని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ, నిర్లక్ష్యానికి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వైద్య నిర్లక్ష్యం జరిగిందా? గడువు ముగిసిన మందులు వాడారా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
