పూంచ్ సెక్టార్‌లో రెండు డ్రోన్లు.. హై అలర్ట్‌లో భారత సైన్యం
శ్రీనగర్: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో పదే పదే డ్రోన్లను ఎగరేస్తూ ఉద్రిక్తత సృష్టిస్తోంది. ఈ వారం మొదట్లో నౌషేరా, రాజౌరి, కేరీ సెక్టార్లలో పాక్ డ్రోన్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే గురువారం (జనవరి 15) రాత్రి పూంచ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసి వెంట రెండు పాక్ డ్రోన్లు సంచరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే భారత సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి యాంటి డ్రోన్ ఆపరేషన్ చేపట్టింది. భారత దళాల ప్రతిఘటనతో డ్రోన్లు తిరిగి పాక్ భూభాగంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని ఎల్‌ఓసి, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సైన్యం తెలిపింది. పాక్ డ్రోన్ల సహాయంతో అక్రమంగా ఆయుధాలను భారత్‌లోకి సరఫరా చేయడం లేదా కీలక సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోందని రక్షణ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సౌత్ వెస్ట్రన్ కమాండ్‌లో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయబడింది. పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా బదులిస్తాం” అని హెచ్చరించారు.
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల అనంతరం రోజుల్లోనే ఎల్‌ఓసి వెంట పాక్ డ్రోన్ల కదలికలు పెరగడం గమనార్హం. వారం వ్యవధిలోనే మూడు సార్లు డ్రోన్లు సంచరించడం సరిహద్దు ఉద్రిక్తతకు దారితీస్తోంది.
మరోవైపు పాక్ డ్రోన్ల కదలికలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్–పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో డ్రోన్ల సంచారంపై భారత్ తన ఆందోళనను స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం.
