అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి స్పందన
ఇంటర్నెట్ డెస్క్:
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో బారామతి ఎయిర్‌పోర్టులో విజిబులిటీ అత్యంత తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు.
ల్యాండింగ్ సమయంలో రన్‌వే కనిపిస్తుందా లేదా అని బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు పైలట్లను ప్రశ్నించగా, రన్‌వే కనిపించడం లేదని పైలట్లు సమాధానమిచ్చారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో విమానం కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టిందని (Go-around) వివరించారు.
రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో మళ్లీ రన్‌వే కనిపిస్తుందా అని ఏటీసీ అడగగా, పైలట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందన్నారు. దాంతో ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిందని, అయితే ఆ వెంటనే విమానం ప్రమాదానికి గురై కూలిపోయిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, పారదర్శకంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే డీజీసీఏ (DGCA), ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau) బృందాలు పుణేకు చేరుకున్నాయని తెలిపారు.
ఇదే అంశంపై డీజీసీఏ వర్గాలు స్పందిస్తూ, ల్యాండింగ్ సమయంలో రన్‌వేను గుర్తించడంలో పైలట్లకు ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్నాయి. అయితే పైలట్ల నుంచి అత్యవసర పరిస్థితిని సూచించే మేడే కాల్స్ (Mayday calls) ఏవీ అందలేదని వెల్లడించినట్లు సమాచారం.
