అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ముగింపు దశలోకి.. ప్రపంచాన్ని వెంటాడుతున్న అణు పోటీ భయం
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ భద్రతకు కీలకంగా ఉన్న అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం (న్యూస్టార్ట్ ఒప్పందం) ఫిబ్రవరి 5తో ముగియనుంది. ఈ ఒప్పందం గడువు ముగియడంతో ఇరుదేశాల అణ్వాయుధ నిల్వలపై ఉన్న పరిమితులు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ పోటీ తిరిగి మొదలయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు అమెరికా ముందుకొస్తే, తాము మరో ఏడాది పాటు దీనికి కట్టుబడి ఉంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రకటించారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యంత్రాంగం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. సరైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాల చరిత్ర
అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించి తొలిసారి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ యూనియన్ నేత బ్రెజ్నెవ్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, 2001లో జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షత్వంలో అమెరికా ఆ ఒప్పందం నుంచి వైదొలిగింది. అనంతరం 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదెవ్ మధ్య ‘న్యూస్టార్ట్’ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం, ఇరుదేశాలు 700కు మించిన క్షిపణులు, యుద్ధవిమానాలను కలిగి ఉండకూడదు. అలాగే, వినియోగానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాల సంఖ్యను 1,550కు మించకుండా పరిమితం చేయాలి. పరస్పర అణు కేంద్రాల తనిఖీలకు కూడా ఇందులో అనుమతి ఉంది. వాస్తవానికి ఈ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉన్నప్పటికీ, ఐదేళ్ల పాటు పొడిగించారు.
ఒప్పందం ముగిస్తే పెరిగే ముప్పు
ఇప్పుడు ఈ ఒప్పందం గడువు ముగియడం ద్వారా గత 35 ఏళ్లలో తొలిసారిగా అణ్వాయుధాలపై ఎలాంటి అంతర్జాతీయ పరిమితులు లేకుండా పరిస్థితి ఏర్పడుతోంది. ఇది అమెరికా, రష్యా మధ్య కొత్త అణ్వాయుధ పోటీకి దారి తీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరగడంతో పాటు అణు ఘర్షణల ముప్పు కూడా అధికమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఈ ఒప్పందాన్ని కొనసాగించడంలో ఇరు దేశాలు విఫలమైతే అణ్వాయుధాల విస్తరణ భారీగా పెరిగే అవకాశం ఉందని అమెరికాలోని ఆయుధ నియంత్రణ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డారిల్ కింబాల్ తెలిపారు. అణు నిల్వలపై ఎలాంటి పరిమితులు లేకపోతే ప్రపంచం మరింత ప్రమాదకరంగా మారుతుందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు.
ఉక్రెయిన్పై దాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని పలుమార్లు స్పష్టం చేశారు. 2024లో దీనికి సంబంధించిన ఆదేశాలపై ఆయన సంతకం కూడా చేశారు. అయితే, న్యూస్టార్ట్ ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించేందుకు చర్చలకు సిద్ధమని పుతిన్ ప్రకటించినప్పటికీ, దీనిపై అమెరికా నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాకపోవడం ప్రపంచ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచుతోంది.
