Uttarakhand: కరెంట్ కోతలతో విసుగు.. ఎమ్మెల్యే విద్యుత్ స్తంభం ఎక్కి..
ఇంటర్నెట్‌డెస్క్: నిత్యం కరెంటు కోతలతో విసుగు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరెంటు స్తంభం ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారుల ఇళ్లకు కరెంటు సరఫరాను నిలిపివేశారు (Congress MLA Cuts Power To Officials). ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తరచూ కరెంటు కోతలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర (Virendra) తన మద్దతుదారులతో కలిసి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బోట్ క్లబ్‌లోని సూపరింటెండెంట్ ఇంజినీర్ వివేక్ రాజ్‌పుత్ అధికార నివాసానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత చీఫ్ ఇంజినీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ పాండేల ఇళ్లకు కూడా కరెంట్ కట్ చేశారు. ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో రోజుకి 5-8 గంటలు కరెంట్ కోతలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వ్యాపారులకు కూడా తీవ్ర నష్టం కలుగుతోందని వాపోయారు. ఈ సమస్యను 10 రోజులుగా విద్యుత్తు శాఖ వద్ద లేవనెత్తుతున్నామని, అయినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చర్యలపై విద్యుత్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు చర్యలు లేకుండా కరెంటు లైన్లను కత్తిరించారని.. ఇది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆరోపించారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమే కాక, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకు వస్తుందని మండిపడ్డారు.
