‘వైబ్ కోడింగ్’ నే రేపటి బిల్‌గేట్స్‌కు మార్గం!
13 ఏళ్లకే ఏఐతో కోడింగ్ చేస్తే భవిష్యత్‌లో భారీ ఎడ్జ్: మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్
ఇంటర్నెట్ డెస్క్: పిన్న వయసులోనే బిలియనీర్‌గా ఎదగడమే కాకుండా మెటా వంటి టెక్ దిగ్గజ సంస్థలో చీఫ్ ఏఐ ఆఫీసర్ స్థాయికి చేరుకున్న 28 ఏళ్ల అలెగ్జాండర్ వాంగ్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ఏఐ టూల్స్‌తో వైబ్ కోడింగ్ చేస్తున్న 13 ఏళ్ల బాలుడే రేపటి బిల్‌గేట్స్‌గా అవతరిస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“మీరు 13 ఏళ్ల వయసులో ఉంటే మీ సమయమంతా వైబ్ కోడింగ్‌కే కేటాయించండి. ఇదే మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది” అని సూచించారు.
మున్ముందు జాబ్ మార్కెట్‌లో ఇతరుల కంటే ముందుండాలనుకునే వారికి ఇది అత్యంత ఉపయోగకరమని వాంగ్ అభిప్రాయపడ్డారు. ఏఐ యుగంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే చిన్న వయసులోనే ఈ నైపుణ్యంపై పట్టు సాధించాలన్నారు.
ఏంటీ వైబ్ కోడింగ్?
వైబ్ కోడింగ్ అనేది తాజా టెక్నాలజీ ట్రెండ్. ఇది సహజ భాష (Natural Language) ఆధారంగా పనిచేసే ఏఐ అసిస్టెడ్ కోడింగ్. సంప్రదాయ కోడింగ్‌లో ప్రోగ్రామింగ్ భాషలపై లోతైన అవగాహన అవసరం. కానీ వైబ్ కోడింగ్‌కు అలాంటివేమీ అవసరం లేదు. సాధారణ ఇంగ్లిష్‌లో యూజర్ తన అవసరాన్ని చెప్పినా చాలు. ఏఐ టూల్స్ ఆ సూచనలను ఫంక్షనల్ కోడ్‌గా మార్చేస్తాయి.
రిప్లిట్, కర్సర్ వంటి వేదికలపై ఎవరైనా సులభంగా యాప్స్, టూల్స్‌ను రూపొందించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, “మీకు ఏం కావాలో చెప్పండి… మిగతాదంతా ఏఐ చూసుకుంటుంది” అన్నమాట.
అలా వచ్చారే నేటి టెక్ దిగ్గజాలు
బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు చిన్న వయసులోనే తొలి తరం కంప్యూటర్లతో ప్రయోగాలు చేయడం వల్లే భారీ అడ్వాంటేజ్ పొందారని వాంగ్ గుర్తుచేశారు. అప్పట్లో కంప్యూటర్లు వారికి ఇచ్చిన ముందడుగు… నేటి తరం పిల్లలకు ఏఐ ఇవ్వబోతోందన్నారు.
ఈ ఏఐ యుగంలో ఎవరైతే కొత్త టూల్స్‌తో ఎక్కువగా ప్రయోగాలు చేస్తారో… వారికే భవిష్యత్‌లో భారీ ఎడ్జ్ దక్కుతుందని చెప్పారు. గేమింగ్, స్పోర్ట్స్ వంటి హాబీలకంటే వైబ్ కోడింగ్‌పై దృష్టి పెట్టాలని యువతకు సూచించారు. రాబోయే రోజుల్లో ఉత్పత్తులు, సేవల స్వరూపాన్ని ఏఐ పూర్తిగా మార్చేస్తుందని జోస్యం చెప్పారు.
ఎవరీ అలెగ్జాండర్ వాంగ్?
అలెగ్జాండర్ వాంగ్ కేవలం 19 ఏళ్ల వయసులోనే ‘స్కేల్ ఏఐ’ అనే స్టార్టప్‌ను స్థాపించారు. 24 ఏళ్లకే బిలియనీర్‌గా అవతరించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో మెటాలో చీఫ్ ఏఐ ఆఫీసర్‌గా, సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్‌ను లీడ్ చేస్తున్నారు. మెటాలోనే అత్యధిక వేతనం పొందుతున్న అధికారిగా కూడా ఆయనకు పేరు ఉంది.
