వరంగల్ : నకిలీ ఏసీబీ టీమ్ – ఫోన్ కాల్స్ బెదిరింపులతో భారీగా వసూళ్లు..! ముఠా అరెస్ట్
ఏసీబీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను నగర సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ఏసీబీ అధికారి ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురి సభ్యులను వరంగల్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడుతున్న ఘరానా నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఈ ముఠా వ్యవహారాలను గుట్టు రట్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు ఏపీకి చెందిన శ్రీనివాస్ అలియాస్ మంగళ శ్రీను అలియాస్ వాసు(45) ఉన్నాడు. నవీన్, మంగళ రవీందర్, మురళి, ప్రసన్న కూడా ఉండగా… సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో వున్నారు. ఈ అరెస్టుకు సంబందించిన వివరాలను వరంగల్ నగర సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ఏసీబీ డీఎస్పీ పేరుతో బెదిరింపు…
సీపీ తెలిపిన వివరాల ప్రకారం… ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్… ప్రభుత్వ శాఖలలో ఉన్నత పదవులో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులతో పాటు పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి ఏసీబీ డీఎస్పీనంటూ ఫోన్ చేసి “మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి వుంటుంది” అని బెదింపులకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు.
ఇందులో భాగంగా నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తుమ్మల జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి బెదిరించి సుమారు 9 లక్షల 96 వేల రూపాయలను వివిధ మార్గాల్లో దోచేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ను మరియు అతనికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
ప్రధాన నిందితుడున శ్రీనివాసులును పోలీసులు విచారించగా…. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో 2002 సంవత్సరంలో మొదట ద్విచక్ర వాహనం చోరీతో దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. మరో కొద్ది రోజులు నిందితుడు నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమ ప్రాంతములో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ గా చేసుకొని వారి వద్ద నుంచి డబ్బులను తీసుకున్నాడు. సుమారు 50 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకు వెళ్లినప్పటికీ నిందితుడు తన వ్యవహర శైలిని మార్చుకోకుండా… జైలు నుండి విడుదలైన అనంతరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు మరియు రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు గుర్తించారు. ఆపై మళ్లీ జైలుకి వెళ్లాడు.
నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం మళ్ళీ సులభంగా డబ్బును సంపాదించాలనే లక్ష్యంగా నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తాడు. ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు ఇతనిపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. సుమారు రూ 50 లక్షలు పైగా దోపిడీకి పాల్పడగా… ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 09 నేరాలు, ఆంధ్ర రాష్ట్రంలో 10 నేరాలకు పాల్పడ్డాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ తెలిపారు.
