భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ అరాచకం – విద్యార్థినిని కొట్టిన భవాని సస్పెండ్
భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ భవాని వ్యవహారం కలకలం రేపింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో జిల్లా కలెక్టర్ స్పందించారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్, వార్డెన్ భవానిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థినిపై శారీరక దాడి చేయడమే కాకుండా, వార్డెన్‌పై పలు ఆరోపణలు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జిల్లా మహిళా అభివృద్ధి అధికారి (DWO)కి కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణలో బాధిత విద్యార్థినికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అలాగే గురుకులాల్లో విద్యార్థినుల భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని సూచించారు.
ఈ ఘటనతో గురుకుల విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తాయి. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు వెల్లడించారు.
