మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మిర్యాలగూడ: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరి 4న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కీలక ప్రకటనలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రైతుల సంక్షేమం కోసం లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా 25 లక్షల 30 వేల మంది రైతులకు సంబంధించిన 21 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశామని తెలిపారు. దీంతో రైతులను అప్పుల కబంధం నుంచి విముక్తులను చేశామని అన్నారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం దాదాపు 9 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని పూర్తిగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా అందిస్తామని తెలిపారు.
గత పాలకులు వరి పంట వేస్తే ఉరి అన్న పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించిన సీఎం.. కాంగ్రెస్ ప్రభుత్వం వరి పండిస్తే గిట్టుబాటు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చే విధానాన్ని అమలు చేసిందని గుర్తు చేశారు. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 15 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. వరి పంట రైతులకు ఉరి కాదని, పండుగగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు.
రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో జరిగిన భారీ బహిరంగ సభే దీనికి సాక్ష్యమని అన్నారు. రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
