“12 ఓట్లు ఇస్తాం.. తులం బంగారం ఇవ్వాలి!”
కామారెడ్డిలో అభ్యర్థికి ఎదురైన విచిత్ర డిమాండ్
కామారెడ్డి :
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు అడిగేందుకు వెళ్లిన ఓ అభ్యర్థికి ఊహించని డిమాండ్ ఎదురైంది. కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ బరిలో ఉన్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి బుధవారం దేవునిపల్లి ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ ఇంట్లోకి వెళ్లిన అభ్యర్థి, తమ కుటుంబం నుంచి ఓట్లు వేయాలని కోరగా.. అక్కడి సభ్యులు “మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి.. గంపగుత్తగా మీకే వేస్తాం. అందుకు ప్రతిగా తులం బంగారం ఇవ్వాలి” అంటూ షరతు పెట్టారు.
ఈ డిమాండ్‌తో అవాక్కైన అభ్యర్థి ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయి, చివరకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
ఓటర్లు తమ సమస్యలు, అవసరాల పరిష్కారం కోరడం మానేసి.. డబ్బులు, బంగారం లాంటి లంచాల కోసం డిమాండ్ చేయడం ప్రస్తుతం కామారెడ్డి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
