మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్:
త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 7) జగిత్యాల జిల్లాలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నామమాత్రపు నిధులే అందాయని విమర్శించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించిన నిధులు ఇప్పటికీ రాలేదని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో సానుకూల వాతావరణం నెలకొందని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఫ్రీ బస్ ప్రయాణం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను మరింత అభివృద్ధి చేసేందుకు రానున్న రోజుల్లో వేల కోట్ల రూపాయలతో కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వైపు ప్రజల వలస పెరుగుతోందని, దానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. బడ్జెట్‌లో వేల కోట్ల నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
