హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తా: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్:
తేదీ: 16.03.2026
హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని కోరుతానని ఆయన తెలిపారు. ఎలాంటి వివాదాలు లేని అనుకూల ప్రదేశాన్ని గుర్తించి క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానని మంత్రి పేర్కొన్నారు. క్రైస్తవ సమాజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం నాడు మెట్టుగూడలో Global Christian Law Board కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి వర్యులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డ్ స్థాపన ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ బోర్డ్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద మరియు అవసరమైన క్రైస్తవులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బోర్డ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. ముఖ్యంగా క్రైస్తవులకు లీగల్ పరంగా అవసరమైన సహాయం అందించేందుకు ఈ లా బోర్డ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
క్రైస్తవ మైనారిటీ సంక్షేమంలో మహిళల అభివృద్ధి కూడా ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. క్రైస్తవ మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
