మోడీని చూసి ఓటేస్తారా?.. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా: సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
హైదరాబాద్:
బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని చూసి బీజేపీకి ఓటేయాలని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. “ఎక్కడైనా పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తామా?” అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి మోడీ వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. మోడీని చూసి ఓటేస్తే ఇక్కడి బోడీలు పని చేయరని టీ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు.
శనివారం (ఫిబ్రవరి 7) ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడూ ప్రజల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. నిజంగా కేసీఆర్ పని చేసి ఉంటే ఇవాళ ఓట్లు అడుక్కునే పరిస్థితి రాకపోయేదన్నారు. బీఆర్ఎస్కు ఎప్పుడూ ఓట్లే కావాలని, ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వలేదన్నారు.
రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు అందించేందుకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని కేసీఆరే అసెంబ్లీలో చెప్పారని, అయినా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. ప్రాణహిత ద్వారా 300 టీఎంసీలు ఇచ్చి ఉంటే రంగారెడ్డి జిల్లాకు తాగునీరు వచ్చేదన్నారు.
రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారో బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన తర్వాత జిల్లాలో ఏ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్ పేరుతో భూసేకరణ కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్‌ను కేసీఆర్ ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించిన సీఎం, త్వరలోనే అక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలోనే ‘కూలేశ్వరం’ అయ్యిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒకరికి జన్వాడలో ఫాం హౌస్ వచ్చిందని ఆరోపించారు. పదేళ్ల దోపిడీ సొమ్ముతో పత్రికలు, టీవీ చానళ్లను పెట్టుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల పాలనలో కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, చేవెళ్ల ప్రాంతాలకు నీళ్లు అందిస్తామని, తాండూరుకు కాగ్నా నది నీళ్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని అన్నారు. మొఖం చెల్లకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు.
రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, గత పాలకుల తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా ఆలోచించి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
